Tuesday, December 28, 2010

పరుసవేది కధా సంగ్రహం

చదివించి కొడుకును చర్చికి పంపిద్దామని అనుకున్న అమ్మానాన్నల అభీష్టానికి వ్యతిరేకంగా పర్యాటకుడు కావాలన్న కోరికతో వారిచ్చిన డబ్బుపెట్టి కొన్ని గొర్రెలు కొనుక్కుని బయల్దేరతాడు. మహాప్రస్థానానికి నాంది పలుకుతాడు. ఎండా వానా ఆకలీ దాహమూ అతడి లక్ష్యాన్ని పిసరంతైనా మార్చలేదు. అవసరాలకు గొర్రెల ఉన్ని అమ్ముకుంటూ ఒకచోటునుంచి మరోచోటుకు తిరుగుతూ కాలం గడుపుతున్న కుర్రాడు శాంటియాగోకు ఓ వ్యాపారి కూతురు నచ్చుతుంది. ఖచ్చితంగా అదే సమయంలో ఆ కుర్రాడిని ఓ కల వెంటాడుతుంటుంది. ఎక్కడో ఈజిప్ట్ దేశంలో పిరమిడ్ల దగ్గరున్న అమూల్యమైన నిధి గురించి అస్పష్టమైన కల అది. అమ్మాయిని కలవడానికి వెళ్తూవెళ్తూ కల గురించి కనుక్కుందామని తారిఫా ఊర్లో స్వప్నాలను విశ్లేషించే దేశ దిమ్మరి ముసలమ్మ దగ్గరికి వెళతాడు. నిధిలో పదోవంతు వాటా అడిగి, తప్పక నిధి కుర్రాడి వశమవుతుందని చెప్తుంది. పుస్తకాలు చదవడం అనే మంచి అలవాటున్న ఆ కుర్రాడు ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ముసలాయన వచ్చి ఈ మాటా ఆ మాటా చెప్తూ ఒక్కసారిగా పిరమిడ్ల దగ్గరకు బయల్దేరమని సలహా ఇస్తాడు. తన కల గురించి ఇతడికెలా తెలిసిందని ఆశ్చర్యపోతుండగా చకచకా కుర్రాడి గత వివరాలన్నీ చెప్పి పదోవంతు గొర్రెలు తీసుకుని నిధి ప్రయాణం గురించి మరిన్ని వివరాలు చెప్తాడు. సాలెం రాజయిన ఆ వృద్ధుడు యూరిమ్, తమ్మిమ్ అనే రెండు విలువైన రత్నాల్లాంటి రాళ్ళిచ్చి శకునాలను నమ్మమంటాడు. ప్రకృతి చెప్పే శకునాలు, తన బుధ్ధికి నచ్చిన శకునాలు తనకెప్పుడూ మంచి చేస్తాయని వృద్ధుడు హితవు పలుకుతాడు. కుర్రాడు తన ఆస్తి గొర్రెలను అమ్మేసి ఆ డబ్బుతో పిరమిడ్లకోసం బయలుదేరతాడు.
ఆఫ్రికాలో దిగగానే టాంజీర్ అనే పట్టణం చేరుకుంటాడు. సాయం చేస్తున్నాడనుకున్న అపరిచుతుడైన స్నేహితుడొకడు దగ్గరచేరి డబ్బంతా కాజేసి దిక్కు తెలియని చోట, భాష తెలియని చోట సాంటియాగోను వదిలేసిపోతాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిన కుర్రాడి వొడిలో రెండు రాళ్లు, వృద్ధుడి విలువైన మాటలు మాత్రమే ఉంటాయి. స్ఫటిక వ్యాపారి దగ్గర నెమ్మదిగా ప్రాపు సంపాదించి కూలీకి చేరిపోతాడు. కుర్రాడు చేరిన తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకోవడం గమనించిన స్ఫటిక వ్యాపారి కుర్రాడిని ప్రేమగా చేరదీస్తాడు. కుర్రాడిచ్చిన సలహాలతో వ్యాపారం మరింత మరింత లాభాలను గడిస్తుంది. ఒకరోజు కొండమీద స్ఫటిక కప్పుల్లో టీ అమ్ముదామని కుర్రాడిచ్చిన సలహా అమలులో పెట్టగానే వ్యాపారం వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా మారిపోతుంది. కుర్రాడికి డబ్బులివ్వడం కూడా పెంచుతుంటాడు. ఆ డబ్బంతా జాగ్రత్తగా కూడబెట్టి ఒకరోజు వ్యాపారి అనుమతి తీసుకుని మళ్లీ పిరమిడ్ల వేటకు బయలుదేరుతాడు. ఈ సారి జాగ్రత్తగా పెద్ద బృందంతో ఒంటెలపై ఎడారి ప్రయాణం మొదలవుతుంది.
ఎడారి గుడారాల బిడారంలో ఆంగ్లేయుడు పరిచయమవుతాడు. లోహాలనుంచి బంగారం తయారుచేసే పరుసవేది విద్యను అధ్యయనం చేస్తున్న ఆ వ్యక్తితో కుర్రాడికి దోస్తీ కుదురుతుంది. ఎడారి జీవితం కుర్రాడికొక ముఖ్య విషయం నేర్పుతుంది – వృద్ధుని మాటకు కొనసాగింపుగా. విశ్వభాష ఒకటుంది. అది నేర్చుకున్నప్పుడు భావ వినిమయానికి భాష అడ్డంకి కాదనేదే ఆ విషయం. నెమ్మది నెమ్మదిగా కుర్రాడు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటాడు. ఆంగ్లేయుడికి ఆ ఎడారి ప్రాంతంలో పరసువేది విద్య తెలిసిన మనిషి ఉన్నాడని తెలుస్తుంది. అతడ్ని కనుగొనే ప్రయత్నంలో కుర్రాని సాయం కోరుతాడు. ఇద్దరి వెతుకులాటలో కుర్రాడికి ఒక ఎడారి బాలికతో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి ఫాతిమా నిధి విషయం తెలుసుకుని కుర్రాడిని ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది. విజయంతో తిరిగొచ్చేదాకా ఎదురుచూస్తానంటుంది. కాని మొత్తం ఆ ప్రయాణం కొన్నాళ్లపాటు అక్కడ ఆగిపోతుంది. దానికి కారణం ఎడారిలో యుద్ధం జరుగుతుండడమే.

ఇంగ్లిష్ మనిషికి దొరకాల్సిన పరసువేది విద్య గురువు తనకు తగిన శిష్యుని వెతుక్కుంటూ కుర్రాడి దగ్గరకు వచ్చేముందు కొన్ని అతీత సంఘటనలు జరుగుతాయి. విశ్వభాష నేర్చుకునే క్రమంలో అన్ని శకునాలను జాగ్రత్తగా అధ్యనం చేయడం మొదలుపెడతాడు. దాన్లో భాగంగా రెండు పక్షులు ఎగిరే తీరునుబట్టి తానున్న చోటులో జరగబోయే యుధ్ధాన్ని దాని ఫలితాన్ని ఊహిస్తాడు. దాని గురుంచి ఎడారిలో వారికి హెచ్చరించి, ప్రియురాలి దగ్గర వీడ్కోలు తీసుకొని, పరసువేది గురువుతో పిరమిడ్ల వేటలో ముందుకు పోతుంటే యుద్ధంలో వైరి వర్గం వీరిని పట్టుకుంటుంది.



ఆ ముఠాతో పరసువేది గురువు కావాలనే కొన్ని అబద్దాలు చెప్తాడు. కుర్రాడైన శాంటియాగోకు విశ్వభాష తెలుసని కావాలంటే అతడు గాలిలో (అంటే ప్రకృతిలో) కలిసిపోగలడని వారికి చెప్పగానే మూడ్రోజుల్లో ఆ విద్య ప్రదర్శించాలని లేదంటే చావు తప్పదని ముఠా నాయకుడు హెచ్చరిస్తాడు. నీవాపని తప్పక చేయగలవని ప్రయత్నించమని వృద్ధుడు ప్రోత్సహిస్తాడు. ప్రయాణంలోను, ఇప్పుడు కూడా గురువెప్పుడూ హృదయాన్ని వినమని కుర్రాడికి చెప్తూనే ఉంటాడు. తన మనసే తనకన్నీ విషయాలూ తెలియజెప్తుందని బోధిస్తాడు. మూడో రోజు తనను గాలిగా మార్చమని ఎడారి ఇసుకను కోరుతాడు. వాయువు సాయం తీసుకోమని ఇసుక చెప్తుంది. గాలితో మాట్లాడితే మనిషిని తనలాగా చేసే శక్తి తనకు లేదని సూర్యుడ్ని అర్థించమని కోరుతుంది. దానికోసం గాలిని ఇసుక తుఫాన్ సృష్టించమని కోరినప్పుడు తానలాగే చేస్తుంది. ముఠా బెదిరిపోతుంది. సూర్యునితో వాదనకు దిగిన కుర్రాడు అతడ్ని మెప్పించి తనను గాలిగా మార్చమని కోరుతాడు. అది తనవల్ల కాదని పరమాత్మను ప్రార్ధించమని సలహా ఇస్తాడు. పరమాత్మను చూస్తున్న కొద్దీ అతడికి "అసలు" సంగతి బోధపడుతుంది. తానూ విశ్వాత్మ వేర్వేరు కాదని, అంతా ఒకటేనని తెలిసిపోతుంది. అంతే.


పరసువేది గురువు, కుర్రాడు పిరమిడ్లకు వెళ్లే దారిలో సన్యాసులుండే మఠంలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే అక్కడి సన్యాసికి కొన్ని వస్తువులు అడిగి వృద్ధుడు తనదగ్గరున్న మణిరాయి (ఫాస్ఫరస్ స్టోన్)తో రాగిని బంగారంగా మార్చి దానిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం తాను తీసుకుంటాడు. రెండో భాగం సాంటియాగోకు, మూడో భాగం సాయపడ్డ సన్యాసికిస్తాడు. నాలుగో భాగం కూడా సన్యాసికే ఇచ్చి కుర్రాడు మళ్లీ ఇక్కడికి వస్తే ఇవ్వమని చెప్పి అక్కడనుంచి శెలవు తీసుకుంటాడు. కుర్రాడు పిరమిడ్ల ప్రదేశానికి చేరుకుని కలలో కనిపించిన చోటు వెదికి తవ్వడం మొదలుపెడతాడు. కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడికో దొంగల ముఠా వస్తుంది. ఈ కుర్రాడు అక్కడ ఏదో దాస్తున్నట్లుగా భావించి ఏమిటో చెప్పమని చితగ్గొడతారు. నిధి కోసం తవ్వుతున్నానని చెప్పినా వినిపించుకోరు. తన్ని తన్ని చివరకు ఆ నాయకుడు ఒక మాట అంటాడు. తనకు కూడా స్పెయిన్లో ఒకచోట చర్చిదగ్గర నిధి ఉన్నట్టు కల వచ్చిందని చెప్తాడు. అయినా తాను మూర్ఖుడిలాగా అక్కడికి వెళ్లలేదని అంటాడు. సన్యాసి దగ్గరకు పరిగెత్తి వెళ్లి తిరుగు ప్రయాణానికి డబ్బులు తీసుకుని తన గడ్డకు చేరుకుని నిధిని దక్కించుకుంటాడు. దేవుడు తనకు పాఠం చెప్పిన తీరుకు సంబరపడతాడు.


విశేషాలు

ఈ నవల చదవగానే రెండు పాత పుస్తకాలు గుర్తుకొస్తాయి. 13వ శతాబ్ది పర్షియన్ కవి రూమీ చెప్పిన మాట గుర్తొస్తుంది. బాగ్దాద్ లో ఉంటూ కైరోగురించి కలలు కంటూ; కైరోలో బాగ్దాద్ గురించి కలలు కంటూ… అన్న మాట మొదటిది కాగా, రెండోది నోబెల్ బహుమతి పొందిన స్విస్ రచన "సిద్ధార్థ". హెర్మన్ హెస్ నవలకు ఖెలో నవలకూ ఎన్నో పోలికలు ఉంటాయి. సంప్రదాయ విద్యకు భిన్నంగా కొత్తదారి వెతుక్కునే ప్రయత్నాన్ని ఇద్దరి నవలల నాయకులూ చాలా చిన్నపుడే మొదలుపెడతారు. తల్లిదండ్రులను ఒప్పించి కొత్తదారిలో ప్రయాణం ప్రారంభిస్తారు. వారి ప్రయత్నాలకు ఇబ్బడి ముబ్బడిగా సకల ప్రకృతి సహకరిస్తుంది. అందుకోసమే ఖెలో నవలకు నోట్ లో ఈ సంగతులన్నీ చాలా స్పష్టంగా, వివరంగా, ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా వివరిస్తాడు. అసలీ ముందుమాటతోనే మనకీ నవలపై ఆసక్తి కలుగుతుంది. మొత్తం ఈ విశ్వమంతా మనుషులుగా మనం చేసే ప్రయత్నాలన్నింటికి సహకారంగా కుట్ర పన్నుతూ ఉంటుందని రచయిత చెప్తాడు. మనల్ని విజయం సాధించకుండా నాలుగే నాలుగు శక్తులు నిరోధిస్తున్నాయని వాటిని అధిగమిస్తే మనకు ఎదురుండదంటాడు. మొదటిది మన చుట్టూ ఉన్నవాళ్లు నిరంతరం బోధించే ‘మనవల్ల కాదులే‘ అనే ధోరణి. రెండోది మనల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేసే ‘ప్రేమ ‘. మూడో అడ్డంకి ‘ఓడిపోతామేమోనన్న భయం‘. ఈ మూడు అధిగమించేక పట్టి ఆపే నాలుగో శత్రువు ‘విజయం పొందబోతున్న చివరి క్షణంలో రాజీపడడం’. ఈ నాలుగు దుర్గుణాల వల్ల మనం మురిపెంగా ప్రేమించే ప్రతిదాన్ని మనమే మన చేతులతోనే చిదిమేసుకుంటున్నాం.


సిద్ధార్థుడికి స్వయంగా వాసుదేవుడే పడవ నడిపేవానిగా వచ్చి రియలైజ్ కావడంలో సాయం చేసినట్టుగా శాంటియాగోకు పరసువేది గురువు స్వయంగా అన్నీ నేర్పిస్తాడు. అక్కడ పల్లెకారుడు నదిని వినమని అర్థిస్తే ఇక్కడ హృదయాన్ని వినమని కోరుతాడు. వినడం ద్వారా మాత్రమే మనం మంచి అభివ్యక్తి నివ్వగలమని స్పష్టం చేయడమన్నమాట. వాల్లకు కావలసింది వారికి దొరికినప్పుడు అక్కడ వాసుదేవుడు, ఇక్కడ గురువు ఇద్దరూ శిష్యులను విడిచిపెడతారు. ప్రయత్నం చేయడం, మరల ప్రయత్నం చేయడం, తిరిగి ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మన కలల్ని సాకారం చేసుకో గలమని ప్రభోదించే మహత్తర నవల ఇది.

నేపధ్యం

బ్రెజిల్ దేశంలో రియోడిజనిరోలో 1947 ఆగస్టులో జన్మించిన పాల్ ఖెలో విప్లవోద్యమాలు అమెరికానంతటినీ ఉద్రేకంతో ఊపేస్తున్నపుడు ఆ నేలంతా పర్యటించాడు. నాటకరంగంలోను, జర్నలిజంలోను కొన్నాళ్ళు గడిపాక 2001 అనే పేరుతో ఒక ప్రత్యామ్నాయ పత్రికనొకదానిని నడిపాడు. మరింత స్వేచ్చా కోసం పోరాడాడు. అయితే ఇరవై ఐదోయేట పారామిలటరీ దళాలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వదిలాక, మనిషి పూర్తిగా మారిపోయాడు. సంగీత రంగంలోకి వెళ్లి అత్మికతను సంతరించుకున్నాడు. మొదట కలలోను, తర్వాత నిజంగాను కనిపించిన ఒక మనిషి సలహాతో కాథలిక్ గా మారిన ఖెలో రాయడాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మొదట్లో అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నా, ఈ నవల విడుదల బ్రెజిల్ సాహిత్య చరిత్రలో మేలిమలుపు. ఖెలో నవలలు పిలిగ్రిమేజ్, ఫిఫ్త్ మౌంటెన్, ఎలెవెన్ మినిట్స్, జహీర్, వాకిరీస్.. అన్నీ ప్రపంచ పాఠకులంతా ఇష్టంతో ఆసక్తితో చదివినవే.
-వికీపీడియా సౌజన్యంతో..

తాత్వికస్థాయిలో జీవితాన్ని విశ్లేషించిన పుస్తకం “పరుసవేది”

ఏ ఒడిదొడుకులు, వత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా సాగిపోవడమే జీవితమని భ్రమపడే మందజీవుల్లో ఒకడు కాదు శాంటియాగో అనే యువకుడు. అతనికి ప్రయాణాలంటే ఇష్టం. గొర్రెల కాపరిగా కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చని తండ్రి ద్వారా తెలుసుకుని, తండ్రి ఇచ్చిన మూడు బంగారు నాణేలతో గొర్రెలను కొని ప్రయాణాలు సాగిస్తుంటాడు. తన గొర్రెలకు పుస్తకాలు చదివి వినిపిస్తూ, తాను చూసిన వింతలను వాటికి వర్ణించి చెబుతుంటాడు. అలా రెండేళ్లు గడిచిపోతుండగా అతన్ని ఒక కల వెన్నాడుతుంది. స్పెయిన్ లో ఒక పాడుబడిన చర్చిలో గొర్రెలతో పాటు నిద్రించిన ఆ యువకుడికి ఆ రాత్రి రెండోసారి అదే కల వచ్చింది. ఆ కల గురించి తెలుసుకోవడానికి బంజార ముదుసలిని, వృద్ధరాజును కలుస్తాడు. ఆ కలకు అర్థం ఆఫ్రికాలోని పిరమిడ్ల వద్ద ఆ యువకునికి నిధి దొరుకుతుందని వారిద్దరు చెబుతారు.
ఎన్నో శకునాల మధ్య, హృదయం మాట వింటూ, విశ్వాత్మ భాష నేర్చుకుని, ఆపదలెన్ని ఎదురైనా ఒయాసిస్సులో, ఎడారిలో ప్రయాణాలు చేసి ఈజిప్టులోని పిరమిడ్ల చెంతకు చేరుతాడు. అతని ఒక్కో మజిలీ సాహసోపేతమైన ఒక్కో అద్భుత అనుభవ గాథ. ఆ అనుభవాలే అతని నిధి అనిపిస్తుంది. ఆ అనుభవ గాథలో మనల్ని మనం మరిచిపోయి, ఆ గొర్రెల కాపరి వెంట మనం నడుస్తుంటాం, ఆ యువకుడు మనకు చిరకాలంగా తెలిసినట్టు. కాని మరుక్షణంలోనే మన జీవిత గమ్యాన్ని చేరడానికి మనం ప్రయత్నిస్తున్నామా అని మనలో ప్రశ్నలు వుదయిస్తాయి. మనం అశాంతికి గురయి, మరచిపోయిన మన జీవిత గమ్యాన్ని తిరిగి గుర్తు చేసుకుంటాం.“బాల్యంలో అందరికీ జీవిత గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఆ వయసులో అంతా స్పష్టంగా ఉంటుంది. అన్నీ సాధ్యమే అనిపిస్తాయి. వాళ్లు కలలు కనడానికి భయపడరు. తమ జీవితంలో కావాలనుకున్న దానికోసం ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ తమ జీవిత గమ్యాన్ని సాధించటం అసాధ్యమని వాళ్లు నమ్మేలా ఒక వింత శక్తి ఏదో చేస్తుంది.”
“… చివరికి మనుషులు తమ జీవిత గమ్యం కంటే… ఇతరులు ఏమి అనుకుంటారో అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.” కాని మన యువకుడు తన జీవిత గమ్యం వైపు ప్రయాణం కొనసాగిస్తాడు.
గొర్రెలను అమ్మి, ఆ డబ్బుతో ఓడ నెక్కాలని టాంజియార్ చేరుకుంటాడు. కాని ఒక కొత్త వ్యక్తి మోసానికి గురయి డబ్బంతా పోగొట్టుకుంటాడు. కొత్త వ్యక్తిని నమ్మినందుకు “ ప్రపంచం ఎలా వుందో కాక, ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ దృష్టి కోణం నుంచి చూసే అందరిలాంటి వాడినే నేను కూడా” అనుకుంటాడు. అంతలోనే “నువ్వు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దానిని నువ్వు సాధించడంలో సహాయపడే విధంగా ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది” అన్న వృద్ధరాజు మాటలను గుర్తు చేసుకుని, మనసును తేలిక చేసుకుంటాడు.

గాజు వస్తువులు అమ్మే ఒక వ్యాపారి వద్ద పనికి కుదురుకుంటాడు. ఆ పనిలో లీనమైపోయి, ఎలా చేస్తే లాభాలు పొందవచ్చో వ్యాపారికి చెప్పి దాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తాడు. వ్యాపారి తన లాభాల్లో అనుకున్న వాటా మన యువకుడికి ఇస్తాడు. అలా పదకొండు నెలలు గడిచేసరికి చాలా డబ్బు గడిస్తాడు. ఆ డబ్బు తీసుకుని తిరిగి తన జీవిత గమ్యం వైపు పయనిస్తాడు. నిజానికి చాలా మందికి ఇలాంటి పరిస్థితి సంభవిస్తే ఇదే బాగుందిలే అని జీవిత గమ్యాన్ని అలవోకగా మరిచిపోయే ప్రమాదం వుంటుంది. గాజు సామాన్ల వ్యాపారి ఎన్నో ఏళ్లుగా మక్కా పోవాలనుకున్నా వెళ్లలేకపోయానని బాధపడతాడు. జీవిత గమ్యాన్ని చేరలేని వారు దాన్ని సాధించలేకపోయామనే దాని కన్నా జీవిత గమ్యం కోసం ప్రయత్నించలేదని ఎక్కువ బాధపడడం ఆ గాజు వ్యాపారిలో చూస్తాం.
“నేర్చుకోవడానికి ఒకటే దారి ఉంది: అది చర్యల ద్వారా” అంటాడు పరుసవేది. తాత్వికస్థాయిలో జీవితాన్ని విశ్లేషించిన గొప్ప పుస్తకం “పరుసవేది” (ది ఆల్కమిస్ట్ ).

“మనం చాలాసార్లు పక్కదార్లు తీసుకుంటున్నా అంతిమంగా గమ్యం వైపుకే పురోగమిస్తున్నాం.” అంటాడు యువకుడితో పాటు ఎడారిలో తోడుగా ప్రయాణిస్తున్న పరుసవేది.

ఎడారిలో యుద్ధాల మధ్య నుంచి ఒయాసిస్సుకు పోతుండగా ఒంటెను నడిపించే వ్యక్తి యువకుడితో ఇలా అంటాడు. “నేను అటు గతంలోనో, ఇటు భవిష్యత్తులోనో జీవించడం లేదు. ప్రస్తుతంపైనే నాకు ఆసక్తి వుంది. ఎప్పుడు ప్రస్తుత క్షణం పైనే దృష్టి నిలపగలిగితే, నువ్వు అదృష్టవంతుడివవుతావు. ఎడారిలో జీవం వుందని, ఆకాశంలో చుక్కలున్నాయని, మానవజాతిలో భాగం కాబట్టి, ఎడారి జాతులు సంఘర్షించుకుంటున్నాయని నువ్వు గమనిస్తావు. అలాంటప్పుడు జీవితం నీకు ఒక అద్భుతమైన విందు అవుతుంది. ఎందుకంటే మనం గడుపుతున్న ప్రస్తుత క్షణమే జీవితం.”

యువకునికి జీవిత గమ్యం చేరేలోగా మూడుసార్లు వున్నదంతా పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితులు సంభవిస్తాయి. అయితే అదే సమయంలో ఆ యువకుడికి మార్గ మధ్యంలో కలిసిన ఆంగ్లేయుడు, ఫాతిమా, పరుసవేది అతని జీవిత గమ్యానికి తోడ్పడుతారు.

ఎడారిలో ప్రయాణం, ఒయాసిస్సులో జీవితం కష్టసుఖాల పల్లవిగా మనల్ని అద్భుతపరుస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు స్వేచ్ఛతో కూడిన స్వచ్ఛమైన తాత్వికతను ఆస్వాదిస్తూ పదేపదే మన జీవిత గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ, జీవిత అనుభవాలను మననం చేసుకుంటాం. అంతేకాదు, ఒకసారి చదివి పుస్తకాన్ని బుక్ షెల్ఫ్ లో పెట్టేయలేం. మళ్లీ మళ్లీ చదవాలనుకుంటాం. ఏ పేజీలోంచి
మొదలుపెట్టినా, ఆ తాత్విక చర్చలో లీనమైపోయి, మళ్లీ మళ్లీ పుస్తకం చివరికంటా చదువుకుంటూ పోతాం.

అంతిమంగా మనం మన హృదయాన్ని వింటున్నామా లేక హృదయం వున్నదన్నదే మరిచిపోయామా అని తరచి చూసుకుంటాం. మన హృదయం మన చుట్టూనే తిరుగుతోంది. కాని రణగొణ ధ్వనుల మధ్య మన హృదయాన్ని ఆలకించడం మరచిపోతున్నాం అనుకుంటాం. ఎక్కడ మన హృదయం వుందో అక్కడే నిధి వుందని తెలుసుకుంటాం. “ఒకరి జీవిత గమ్యానికి అడ్డుపడేవారు వారు తమ జీవిత గమ్యం ఎప్పుడూ చేరుకోలేరు.” “ప్రతి ఒక్కరూ తమ నిధి కోసం వెతికి, దానిని సాధించాలి. ఆ తరువాత గత జీవితంలో కంటే తమను తాము మెరుగు పరుచుకోవాలి. తన అవసరం ఉన్నంతవరకు సీసం తన పాత్ర పోషిస్తుంది, ఆ తరువాత అది బంగారంగా మారాల్సి వుంటుంది”. “ప్రేమ అనేది ఒక శక్తి. అది విశ్వాత్మను మార్చి మెరుగు పరుస్తుంది… విశ్వాత్మను పెంచి పోషించేది మనమే. మనల్ని మెరుగుపరచుకుంటామా, క్షీణింపచేసుకుంటామా అన్న దాన్ని బట్టి మనం నివసించే ప్రపంచం మెరుగుపడుతుంది లేదా క్షీణిస్తుంది”.

పాలో కొయిలో పోర్చుగీసులో రాసిన ‘ది ఆల్కమిస్ట్ ‘ని తెలుగు పాఠకులకు అందించిన ‘మంచి పుస్తకం’ వారికి అభినందనలు.
-ఎస్.జయ
పరుసవేది (ది ఆల్కమిస్ట్ )నవల
రచయిత :పాలో కొయిలో
ప్రచురణ: మంచి పుస్తకం, వెల 90.
ప్రతులకు: మంచి పుస్తకం,
12-13-450, వీధి నెం.1
తార్నాక, సికింద్రాబాద్ – 500 017,
సోల్ డిస్ట్రిబ్యూటర్ “నవోదయ బుక్ హౌస్,
ఆర్య సమాజ్ ఎదురుగా,
కాచిగూడ, హైదరాబాద్

అరటి బంగారం -కథ

అనగనగా ఒక ఊళ్లో... ఓ అందమైన యువకుడు. అతనికి కొత్తగా పెళ్లయింది. అబ్బాయి మంచివాడే కాని అతనితో ఒక్కటే సమస్య. పగలూ, రాత్రి అతడు పరుస వేది ప్రయోగాలు చేస్తూ గడిపేస్తున్నాడు. అతని భార్య కలవరపడిపోయింది. ఇల్లు గడవడమే కష్టమయిపోతోంది. ఉద్యోగం చేయమంటే వద్దంటున్నాడు. బంగారాన్ని సృష్టించి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోతానంటున్నాడు.
అమ్మాయి వెళ్లి తన తండ్రి దగ్గర గోల పెట్టింది. మీ అల్లుడుగారిని మార్చండి అంటూ ప్రాథేయపడింది. అప్పుడు మామగారు అల్లుడి దగ్గరకు వెళ్లారు. కాని ఆయన మందలించలేదు.
 ‘‘బాబూ... నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా... చిన్నతనంలో నేను కూడా పరుసవేది ప్రయోగాలు చేశాను. బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనుక్కున్నాను. అది నీకు చెప్పాలని ఉంది...’’ అన్నారు. అబ్బాయి మొహం వికసించింది. చెప్పండన్నాడు ఆత్రుతగా.
‘‘అరటిపండ్ల మీద ఏర్పడే తెల్లని ధూళి ఉంటేగాని నీ ప్రయోగం ఫలించదు... కాని అందుకు రెండు టన్నుల ధూళి కావాలి..’’ చెప్పాడు మామగారు. అబ్బాయి ఆలోచించలేదు. వెంటనే పొలంలో అరటి తోట వేశాడు. తనే దగ్గరుండి తోటను చూసుకున్నాడు. చక్కని పంట పండించాడు. ధూళితో మామగారి దగ్గరకు వెళ్ళాడు.
‘‘ఇది అవసరం లేదయ్యా... నువ్వు ఇప్పటికే బంగారాన్ని సాధించావు’’ అన్నాడు చల్లగా.
అబ్బాయి ఆశ్చర్యపోయేలోపే... పక్కనుంచి అమ్మాయి వచ్చింది. ఆమె రెండు సంచుల నిండా బంగారం కాసుల్ని అతని ముందు బోర్లించింది. అప్పుడు మామగారు చెప్పారు...
‘‘నువ్వు శ్రమపడి పండించిన అరటిపండ్లను అమ్మాయి అమ్మి ఇంత సొమ్ము సంపాదించింది. ఇదేనయ్యా... పరుసవేది...’’ అన్నారు. అబ్బాయికి జ్ఞానోదయం అయింది.

శూన్య బంగారం... పరుసవేది!



అల్‌కెమిస్ట్ అంటే రసాయనాల ద్వారా బంగారాన్ని తయారుచేయగలిగిన వాడు. అల్‌కెమీ అంటే పరుసవేది. సువర్ణ శాస్త్రం. బంగారాన్ని తయారుచేసే ప్రక్రియ. అల్‌కెమిస్ట్ నవలలో శాంటియాగో అనే గొర్రెలకాపరి బంగారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు. బంగారాన్ని తయారుచేసే విద్య తెలుసుకున్నాడా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నవాడు సర్ ఐజాక్ న్యూటన్. మూడు వందల ఏళ్ల కిందట... న్యూటన్ కూడా బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు. కాని బంగారాన్ని సృష్టించగలిగాడా? ఇంకా పూర్వం... ఆరు వందల ఏళ్ల కిందట... వేమన పరుసవేది విద్యను ఔపోసన పట్టాడన్నారు. వేమన రాసిన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన రహస్య సమాచారం నిక్షిప్తమై ఉందని భావించారు. నిజంగా వేమన బంగారాన్ని తయారు చేయగలిగాడా? మనిషి బంగారాన్ని సృష్టించగలడా? బంగారాన్ని మనం తయారుచేయగలమా? పరుసవేది విద్య... నిజమేనా? ఒట్టి నమ్మకమేనా? లేక శూన్యమేనా?
 బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.
 బంగారం. ఆ మాట వింటేనే ఎవరికయినా మనసు మెరుస్తుంది. ఒళ్లంతా బంగారం అవ్వాలనుకుంటారు మగువలు. ఇల్లంతా బంగారం కావాలనుకుంటారు మగవారు. ముట్టుకుంటే రాయి కూడా బంగారమైపోవాలన్నది చాలామంది కల. మిడాస్ టచ్ కథ అలా పుట్టిందే. బాబాలూ, స్వామీజీలు గాల్లో చేతులు ఊపి బంగారు గొలుసులు, ఉంగరాలూ సృష్టిస్తే మనకు ఆశ్చర్యం. ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయంటూ ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు మంత్రగాళ్లు. ఎంత బంగారం ఉంటే అంత సంపద. ఎంత లేకపోతే అంతకు అన్నింతల ఆశ. బంగారాన్ని మనిషి కనుగొన్న నాటి నుంచి, బంగారం గొప్పదనాన్ని తెలుసుకున్న నాటి నుంచి, దాన్ని ఆభరణంగా వాడటం మొదలుపెట్టిన నాటి నుంచి బంగారం అంటే మనిషికి అపరిమితమైన వ్యామోహం.
 ఇప్పుడూ అప్పుడూ కాదు... లక్షల సంవత్సరాలుగా బంగారం మీద మనిషికి తరగని మమకారం. కాని ఏం లాభం? మనిషికి ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి 2009 వరకూ వెలికి తీసిన బంగారం మొత్తం లక్షా 65 వేల టన్నులు. అయినా కూడా ఈ బంగారం సరిపోదు. ఇంకా బంగారం కావాలి. బతుకంతా బంగారుమయం కావాలి. కొన్ని యుగాలుగా మనిషిని వీడని ఆశ! ఈ ఆశకు ఫలితమే పరుసవేది. బంగారాన్ని తయారుచేసే విద్య.
 ఆనాటి ఈజిప్టు, మెసొపటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాలలో శతాబ్దాలుగా రసాయన శాస్తవ్రేత్తలు బంగారాన్ని తయారుచేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియనే అల్‌కెమీ అంటారు. మనం పరుసవేది అంటున్నాం. ఐదు వేల సంవత్సరాల కిందట పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేసేవారు అనే కథలున్నాయి. ఒక్కోసారి ఊహలు నిజమవుతాయనిపిస్తాయి. అప్పట్లో అది సాధ్యమని చాలామంది శాస్తవ్రేత్తలు భావించారు. శ్రమించారు.
 బంగారాన్ని మనిషి తయారుచేయవచ్చన్న ఆలోచన అప్పట్లో ఎంత బలంగా ఉందంటే, సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప సైంటిస్టు కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడానికి ప్రయోగాలు చేశాడు. 17వ శతాబ్దానికి సంబంధించిన యోగి వేమన కొద్దిరోజులు యోగ విద్య నేర్చుకుని పరుసవేది ప్రయోగాలు చేశాడని కథలున్నాయి. ఆ బంగారు సృష్టికి సంబంధించిన విద్య రహస్యాలను ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం ఉంది. దీనితో చాలా కాలంగా వేమన పద్యాల్లో నిగూఢ అర్థాలేమయినా ఉన్నాయా? అనే విషయం మీద పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.
 ‘‘ఉప్పు చింతకాయ ఊరిలోనుండగ...
కరువదేల వచ్చు కాంతలారా...’’
...లాంటి పద్యాల్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన దాఖలాలూ ఉన్నాయి. కాని ఇదంతా నిజమేనా? సాధ్యమేనా? లేక ఒట్టి అభూతకల్పనా? బంగారాన్ని తయారుచేయడం సైన్సా? ఫిక్షనా?
 దుస్సాధ్యం... అంటుంది సైన్సు. బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.
బంగారం... అంటే గోల్డ్... దీనినే లాటిన్‌లో అరమ్ అంటారు. గోల్డ్ కూడా ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ అఠ. గోల్డ్ అటామిక్ నెంబర్ 79. బంగారం విశిష్టత ఏమిటంటే, దీనికి కెమికల్ రియాక్షన్స్‌ని తట్టుకుని నిలబడే శక్తి ఎక్కువ ఉంటుంది. మిగతా లోహాలతో తేలికగా కలిసిపోగలుగుతుంది. కెమికల్‌గా గోల్డ్ ఒక ఎలిమెంట్ అయినప్పుడు... దాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తారు సైంటిస్టులు. ప్రకృతిసిద్ధంగా తయారయిన కొన్నింటినే మూలకాలు గుర్తించారు. ఇనుము ఒక మూలకం... వెండి, కాంస్యం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్... ఇలా వేటికవే ప్రత్యేకమైన ఎలిమెంట్స్. ఇవి బేస్ ఎలిమెంట్స్. వాటి సమ్మేళనం ద్వారా తయారుచేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహమిశ్రమాలు (అలాయ్స్). అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవమాత్రుడికి సాధ్యం కాదు అన్నది సైంటిస్టుల వాదన. అందుకే ఇంతవరకూ పరుసవేది ద్వారా బంగారాన్ని ఎవ్వరైనా సృష్టించారు అంటే అది నమ్మనవసరం లేదని అంటారు వారు. మరి ఇంతకాలం మనం విన్న పరుసవేది కథలన్నీ పుక్కిటి పురాణాలేనా?

ప్రపంచం రోజురోజుకూ పెరుగుతోంది. మనుషుల సంఖ్య పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఉంటే అంత సంపద. ఇది ఒక్క మనిషికో, కుటుంబానికో సంబంధించినది మాత్రమే కాదు. ఒక దేశానికి ఎంత బంగారు నిల్వలు (గోల్డ్ రిజర్వ్) ఉంటే అంత సంపన్న దేశంగా గుర్తింపు ఉంటుంది. బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండు ఇంకొన్ని యుగాలయినా ఉంటుంది. బంగారం మీద మనిషికి ఆశ కొనసాగుతుంటుంది. టెక్నాలజీ పెరుగుతోంది, మనిషి మేధస్సు పెరుగుతోంది, కాబట్టి బంగారాన్ని తయారుచేయడానికి మనిషి మార్గాలు అన్వేషిస్తూనే ఉంటాడు. కాని ఎప్పటికయినా మనిషి పరుసవేది విద్యను నిజం చేయగలుగుతాడా? బంగారాన్ని సృష్టించగలుగుతాడా?
 ఏమో... బహుశా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడం సాధ్యపడొచ్చు అనే వాళ్లూ ఉన్నారు. అందుకు శాస్ర్తీయంగా వాళ్లు చెప్పే కారణాలూ సహేతుకంగానే ఉన్నాయి. బంగారం ఒక రసాయనమూలకం. ఇది కొన్ని బంగారు అణువుల సముదాయంగా ఉంటుంది. కొన్ని చౌకయిన లోహాలు, మిశ్రమాల ఎలిమెంట్లను సబ్‌అటామిక్ స్థాయిలో బ్రేక్ చేయగలిగి, వాటి ద్వారా బంగారుఅణువు తయారుచేయగలిగితే, ఆ లోహాలు లేదా మిశ్రమాలు బంగారంగా మారే అవకాశం ఉంటుందన్నది కొందరు సైంటిస్టుల వాదన. అయితే, అలా చేయడానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అంత కష్టపడి బంగారాన్ని సృష్టించడం కన్నా బంగారాన్ని ఎంత ధరయినా పెట్టి కొనడమే చౌక. అంటే.. పరుసవేది విద్య నిజం కావచ్చనే సూచనలు ఉన్నట్టేగా! బహుశా ఈ దిశగా ఇంకొన్ని ప్రయోగాలు జరిగితే మనిషి ఏనాటికయినా బంగారాన్ని సృష్టించగలుగుతాడా? ఇప్పటికంటే పూర్వకాలమే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ఉంటుందా? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు.
 పరుసవేది విద్య గురించి కేవలం శాస్తవ్రేత్తలు మాత్రమే కాదు, సన్యాసులు, బౌద్ధులు, వేదాంతులు కూడా మాట్లాడారు. దీనితో వేదాల్లోనూ, పూర్వకాలపు శాస్ర్తాల్లోనూ పరుసవేది రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయని నమ్మి మళ్లీ చాలామంది పరిశోధనలు చేశారు. అంత జ్ఞానాన్ని మధించిన తర్వాత వాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టమయింది. వేదాంతులు, ఫిలాసఫర్లు చెప్పే పరుసవేదికి మాత్రం ఇక్కడ అర్థం వేరు. మనిషి బంగారాన్ని తయారుచేయడం కాదు. మనిషే బంగారంగా మారాలంటారు వాళ్లు. ఇక్కడ పరుసవేది... మనస్సుకు సంబంధించిన విద్య. మంచి మనసు కన్నా బంగారం ఏముంటుంది?
 - సతీశ్ కుమార్
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Friday, September 10, 2010

పరుసవేది