ఆఫ్రికాలో దిగగానే టాంజీర్ అనే పట్టణం చేరుకుంటాడు. సాయం చేస్తున్నాడనుకున్న అపరిచుతుడైన స్నేహితుడొకడు దగ్గరచేరి డబ్బంతా కాజేసి దిక్కు తెలియని చోట, భాష తెలియని చోట సాంటియాగోను వదిలేసిపోతాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిన కుర్రాడి వొడిలో రెండు రాళ్లు, వృద్ధుడి విలువైన మాటలు మాత్రమే ఉంటాయి. స్ఫటిక వ్యాపారి దగ్గర నెమ్మదిగా ప్రాపు సంపాదించి కూలీకి చేరిపోతాడు. కుర్రాడు చేరిన తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకోవడం గమనించిన స్ఫటిక వ్యాపారి కుర్రాడిని ప్రేమగా చేరదీస్తాడు. కుర్రాడిచ్చిన సలహాలతో వ్యాపారం మరింత మరింత లాభాలను గడిస్తుంది. ఒకరోజు కొండమీద స్ఫటిక కప్పుల్లో టీ అమ్ముదామని కుర్రాడిచ్చిన సలహా అమలులో పెట్టగానే వ్యాపారం వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా మారిపోతుంది. కుర్రాడికి డబ్బులివ్వడం కూడా పెంచుతుంటాడు. ఆ డబ్బంతా జాగ్రత్తగా కూడబెట్టి ఒకరోజు వ్యాపారి అనుమతి తీసుకుని మళ్లీ పిరమిడ్ల వేటకు బయలుదేరుతాడు. ఈ సారి జాగ్రత్తగా పెద్ద బృందంతో ఒంటెలపై ఎడారి ప్రయాణం మొదలవుతుంది.
ఆ ఎడారి గుడారాల బిడారంలో ఆంగ్లేయుడు పరిచయమవుతాడు. లోహాలనుంచి బంగారం తయారుచేసే పరుసవేది విద్యను అధ్యయనం చేస్తున్న ఆ వ్యక్తితో కుర్రాడికి దోస్తీ కుదురుతుంది. ఎడారి జీవితం కుర్రాడికొక ముఖ్య విషయం నేర్పుతుంది – వృద్ధుని మాటకు కొనసాగింపుగా. విశ్వభాష ఒకటుంది. అది నేర్చుకున్నప్పుడు భావ వినిమయానికి భాష అడ్డంకి కాదనేదే ఆ విషయం. నెమ్మది నెమ్మదిగా కుర్రాడు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటాడు. ఆంగ్లేయుడికి ఆ ఎడారి ప్రాంతంలో పరసువేది విద్య తెలిసిన మనిషి ఉన్నాడని తెలుస్తుంది. అతడ్ని కనుగొనే ప్రయత్నంలో కుర్రాని సాయం కోరుతాడు. ఇద్దరి వెతుకులాటలో కుర్రాడికి ఒక ఎడారి బాలికతో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి ఫాతిమా నిధి విషయం తెలుసుకుని కుర్రాడిని ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది. విజయంతో తిరిగొచ్చేదాకా ఎదురుచూస్తానంటుంది. కాని మొత్తం ఆ ప్రయాణం కొన్నాళ్లపాటు అక్కడ ఆగిపోతుంది. దానికి కారణం ఎడారిలో యుద్ధం జరుగుతుండడమే.
ఇంగ్లిష్ మనిషికి దొరకాల్సిన పరసువేది విద్య గురువు తనకు తగిన శిష్యుని వెతుక్కుంటూ కుర్రాడి దగ్గరకు వచ్చేముందు కొన్ని అతీత సంఘటనలు జరుగుతాయి. విశ్వభాష నేర్చుకునే క్రమంలో అన్ని శకునాలను జాగ్రత్తగా అధ్యనం చేయడం మొదలుపెడతాడు. దాన్లో భాగంగా రెండు పక్షులు ఎగిరే తీరునుబట్టి తానున్న చోటులో జరగబోయే యుధ్ధాన్ని దాని ఫలితాన్ని ఊహిస్తాడు. దాని గురుంచి ఎడారిలో వారికి హెచ్చరించి, ప్రియురాలి దగ్గర వీడ్కోలు తీసుకొని, పరసువేది గురువుతో పిరమిడ్ల వేటలో ముందుకు పోతుంటే యుద్ధంలో వైరి వర్గం వీరిని పట్టుకుంటుంది.
ఆ ముఠాతో పరసువేది గురువు కావాలనే కొన్ని అబద్దాలు చెప్తాడు. కుర్రాడైన శాంటియాగోకు విశ్వభాష తెలుసని కావాలంటే అతడు గాలిలో (అంటే ప్రకృతిలో) కలిసిపోగలడని వారికి చెప్పగానే మూడ్రోజుల్లో ఆ విద్య ప్రదర్శించాలని లేదంటే చావు తప్పదని ముఠా నాయకుడు హెచ్చరిస్తాడు. నీవాపని తప్పక చేయగలవని ప్రయత్నించమని వృద్ధుడు ప్రోత్సహిస్తాడు. ప్రయాణంలోను, ఇప్పుడు కూడా గురువెప్పుడూ హృదయాన్ని వినమని కుర్రాడికి చెప్తూనే ఉంటాడు. తన మనసే తనకన్నీ విషయాలూ తెలియజెప్తుందని బోధిస్తాడు. మూడో రోజు తనను గాలిగా మార్చమని ఎడారి ఇసుకను కోరుతాడు. వాయువు సాయం తీసుకోమని ఇసుక చెప్తుంది. గాలితో మాట్లాడితే మనిషిని తనలాగా చేసే శక్తి తనకు లేదని సూర్యుడ్ని అర్థించమని కోరుతుంది. దానికోసం గాలిని ఇసుక తుఫాన్ సృష్టించమని కోరినప్పుడు తానలాగే చేస్తుంది. ముఠా బెదిరిపోతుంది. సూర్యునితో వాదనకు దిగిన కుర్రాడు అతడ్ని మెప్పించి తనను గాలిగా మార్చమని కోరుతాడు. అది తనవల్ల కాదని పరమాత్మను ప్రార్ధించమని సలహా ఇస్తాడు. పరమాత్మను చూస్తున్న కొద్దీ అతడికి "అసలు" సంగతి బోధపడుతుంది. తానూ విశ్వాత్మ వేర్వేరు కాదని, అంతా ఒకటేనని తెలిసిపోతుంది. అంతే.
పరసువేది గురువు, కుర్రాడు పిరమిడ్లకు వెళ్లే దారిలో సన్యాసులుండే మఠంలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే అక్కడి సన్యాసికి కొన్ని వస్తువులు అడిగి వృద్ధుడు తనదగ్గరున్న మణిరాయి (ఫాస్ఫరస్ స్టోన్)తో రాగిని బంగారంగా మార్చి దానిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం తాను తీసుకుంటాడు. రెండో భాగం సాంటియాగోకు, మూడో భాగం సాయపడ్డ సన్యాసికిస్తాడు. నాలుగో భాగం కూడా సన్యాసికే ఇచ్చి కుర్రాడు మళ్లీ ఇక్కడికి వస్తే ఇవ్వమని చెప్పి అక్కడనుంచి శెలవు తీసుకుంటాడు. కుర్రాడు పిరమిడ్ల ప్రదేశానికి చేరుకుని కలలో కనిపించిన చోటు వెదికి తవ్వడం మొదలుపెడతాడు. కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడికో దొంగల ముఠా వస్తుంది. ఈ కుర్రాడు అక్కడ ఏదో దాస్తున్నట్లుగా భావించి ఏమిటో చెప్పమని చితగ్గొడతారు. నిధి కోసం తవ్వుతున్నానని చెప్పినా వినిపించుకోరు. తన్ని తన్ని చివరకు ఆ నాయకుడు ఒక మాట అంటాడు. తనకు కూడా స్పెయిన్లో ఒకచోట చర్చిదగ్గర నిధి ఉన్నట్టు కల వచ్చిందని చెప్తాడు. అయినా తాను మూర్ఖుడిలాగా అక్కడికి వెళ్లలేదని అంటాడు. సన్యాసి దగ్గరకు పరిగెత్తి వెళ్లి తిరుగు ప్రయాణానికి డబ్బులు తీసుకుని తన గడ్డకు చేరుకుని నిధిని దక్కించుకుంటాడు. దేవుడు తనకు పాఠం చెప్పిన తీరుకు సంబరపడతాడు.
విశేషాలు
ఈ నవల చదవగానే రెండు పాత పుస్తకాలు గుర్తుకొస్తాయి. 13వ శతాబ్ది పర్షియన్ కవి రూమీ చెప్పిన మాట గుర్తొస్తుంది. బాగ్దాద్ లో ఉంటూ కైరోగురించి కలలు కంటూ; కైరోలో బాగ్దాద్ గురించి కలలు కంటూ… అన్న మాట మొదటిది కాగా, రెండోది నోబెల్ బహుమతి పొందిన స్విస్ రచన "సిద్ధార్థ". హెర్మన్ హెస్ నవలకు ఖెలో నవలకూ ఎన్నో పోలికలు ఉంటాయి. సంప్రదాయ విద్యకు భిన్నంగా కొత్తదారి వెతుక్కునే ప్రయత్నాన్ని ఇద్దరి నవలల నాయకులూ చాలా చిన్నపుడే మొదలుపెడతారు. తల్లిదండ్రులను ఒప్పించి కొత్తదారిలో ప్రయాణం ప్రారంభిస్తారు. వారి ప్రయత్నాలకు ఇబ్బడి ముబ్బడిగా సకల ప్రకృతి సహకరిస్తుంది. అందుకోసమే ఖెలో నవలకు నోట్ లో ఈ సంగతులన్నీ చాలా స్పష్టంగా, వివరంగా, ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా వివరిస్తాడు. అసలీ ముందుమాటతోనే మనకీ నవలపై ఆసక్తి కలుగుతుంది. మొత్తం ఈ విశ్వమంతా మనుషులుగా మనం చేసే ప్రయత్నాలన్నింటికి సహకారంగా కుట్ర పన్నుతూ ఉంటుందని రచయిత చెప్తాడు. మనల్ని విజయం సాధించకుండా నాలుగే నాలుగు శక్తులు నిరోధిస్తున్నాయని వాటిని అధిగమిస్తే మనకు ఎదురుండదంటాడు. మొదటిది మన చుట్టూ ఉన్నవాళ్లు నిరంతరం బోధించే ‘మనవల్ల కాదులే‘ అనే ధోరణి. రెండోది మనల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేసే ‘ప్రేమ ‘. మూడో అడ్డంకి ‘ఓడిపోతామేమోనన్న భయం‘. ఈ మూడు అధిగమించేక పట్టి ఆపే నాలుగో శత్రువు ‘విజయం పొందబోతున్న చివరి క్షణంలో రాజీపడడం’. ఈ నాలుగు దుర్గుణాల వల్ల మనం మురిపెంగా ప్రేమించే ప్రతిదాన్ని మనమే మన చేతులతోనే చిదిమేసుకుంటున్నాం.సిద్ధార్థుడికి స్వయంగా వాసుదేవుడే పడవ నడిపేవానిగా వచ్చి రియలైజ్ కావడంలో సాయం చేసినట్టుగా శాంటియాగోకు పరసువేది గురువు స్వయంగా అన్నీ నేర్పిస్తాడు. అక్కడ పల్లెకారుడు నదిని వినమని అర్థిస్తే ఇక్కడ హృదయాన్ని వినమని కోరుతాడు. వినడం ద్వారా మాత్రమే మనం మంచి అభివ్యక్తి నివ్వగలమని స్పష్టం చేయడమన్నమాట. వాల్లకు కావలసింది వారికి దొరికినప్పుడు అక్కడ వాసుదేవుడు, ఇక్కడ గురువు ఇద్దరూ శిష్యులను విడిచిపెడతారు. ప్రయత్నం చేయడం, మరల ప్రయత్నం చేయడం, తిరిగి ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మన కలల్ని సాకారం చేసుకో గలమని ప్రభోదించే మహత్తర నవల ఇది.
నేపధ్యం
బ్రెజిల్ దేశంలో రియోడిజనిరోలో 1947 ఆగస్టులో జన్మించిన పాల్ ఖెలో విప్లవోద్యమాలు అమెరికానంతటినీ ఉద్రేకంతో ఊపేస్తున్నపుడు ఆ నేలంతా పర్యటించాడు. నాటకరంగంలోను, జర్నలిజంలోను కొన్నాళ్ళు గడిపాక 2001 అనే పేరుతో ఒక ప్రత్యామ్నాయ పత్రికనొకదానిని నడిపాడు. మరింత స్వేచ్చా కోసం పోరాడాడు. అయితే ఇరవై ఐదోయేట పారామిలటరీ దళాలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వదిలాక, మనిషి పూర్తిగా మారిపోయాడు. సంగీత రంగంలోకి వెళ్లి అత్మికతను సంతరించుకున్నాడు. మొదట కలలోను, తర్వాత నిజంగాను కనిపించిన ఒక మనిషి సలహాతో కాథలిక్ గా మారిన ఖెలో రాయడాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మొదట్లో అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నా, ఈ నవల విడుదల బ్రెజిల్ సాహిత్య చరిత్రలో మేలిమలుపు. ఖెలో నవలలు పిలిగ్రిమేజ్, ఫిఫ్త్ మౌంటెన్, ఎలెవెన్ మినిట్స్, జహీర్, వాకిరీస్.. అన్నీ ప్రపంచ పాఠకులంతా ఇష్టంతో ఆసక్తితో చదివినవే.-వికీపీడియా సౌజన్యంతో..
No comments:
Post a Comment