బంగారం అంటే ప్రాణం పెట్టుకుంటారు ఆడబడుచులు. అందునా భారతీయ వనితలు మరీనూ. ఒకనాడు
సంప్రదాయ ఆభరణాలకు ప్రాధాన్యమిచ్చే పడతుల్లో ప్రస్తుతం మార్కెట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న కొంగ్రొత్త ఫ్యాషనబుల్ ఆభరణాల వినియోగం పెరిగి పోయింది. తొలి నుంచి మన దేశం స్వర్ణాభరణాల వినియోగానికి కేంద్ర స్థానంగా ఉండేది. మన దేశంలో ఏదైనా శుభకార్యం నిర్వహణ పసిడి కొనుగోలు చేయందే పూర్తి కాదు. అత్యధిక విలువ పెట్టి కొనుగోలు చేసే ఈ బంగారం వారి భవిష్యత్ అవసరాలు కూడా తీరుస్తుంది. ప్రస్తుతం ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా పసిడి ధర దూసుకు పోతున్నది.
ఇప్పుడు దేశాలన్నీ పసిడి నిల్వలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. పసిడి అంతర్జాతీయ మారక ద్రవ్యం కావడం కూడా అందుకు ఓ కారణం. అయితే జనాభాలో రెండో స్థానంలో ఉన్న మనదేశం దేశీయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టే స్థాయి నుంచి ప్రపంచ బ్యాంక నుంచి టన్నుల కొద్దీ కొనుగోలుతో నిల్వలు పెంచుకునే స్థాయికి ఎదిగింది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే బంగారం నిల్వల కొనసాగింపులో భారత్ 11వ స్థానంలో ఉంది.
కానీ మన దేశ విస్తీర్ణంలో గానీ, జనాభాలో గానీ సరిపోలని సిట్జర్లాండ్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బంగారం నిల్వల్లో స్విట్జర్లాండ్‌లో ఏడవ స్థానంలో ఉంది. దానికంటే ముందు చైనా ఆరవ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర రూ.57, 316 పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు నాటకీయంగా సంప్రదాయక సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ బంగారం కొనుగోలుపై దృష్టిని కేంద్రీకరించారు. తదనుగుణంగా పసిడి సైతం తనకు స్వర్గధామంగా మారిన ప్రదేశాలకే తరలి వెళుతోంది. ప్రథమ స్థానంలో అమెరికా నిలిస్తే 15వ స్థానంలో వెనిజులా ఉంది.
నెలవారీగా ప్రపంచ స్వర్ణ మండలి వెలువరించే గణాంకాలను ఆధారంగా తీసుకుంటే..... రమారమీ ప్రపంచ వ్యాప్తంగా బంగారం నిల్వలు వివిధ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, కేంద్రీయ బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మొత్తం బంగారం నిల్వల్లో 20.5 శాతం అంటే సుమారు 29,787 టన్నుల బంగారం ప్రభుత్వాలు, బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల పరిధిలో మగ్గుతుందన్నమాట.
భారత్
నిల్వల విలువ : రూ. 1, 13, 068 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 614.58 టన్నులు.
ది రిజర్వు బ్యాంక ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న బంగారం నిల్వల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 1,13, 068 కోట్లు ఉంటుంది. ఇది భారత్ విదేశీ ద్రవ్య నిల్వల్లో 6.9 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా బంగారం నిల్వల్లో తన స్థానాన్ని పెంచుకునేందుకు భారత్ తహతహ లాడుతోంది. 2009 నవంబర్‌లో భారత్ ఐఎంఎఫ్ నుంచి 200 టన్నుల బంగారం 6.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. భూగర్భ నిధులను వెలికి తీసేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని భారత ప్రభుత్వం, జాతీయ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది.ఏయే దేశాలు అత్యధికంగా బంగారం నిల్వలు కొనసాగిస్తున్నాయో తెలుసుకోవాలని ఉందా ఒకసారి పరిశీలిద్దాం.
అమెరికా
నిల్వల విలువ : రూ.16,49, 698 కోట్లు.
నిల్వ ఉన్న బంగారం : 8,965.65 టన్నులు.
కెంటకీలోని అమెరికా బులియన్ డిపాజిటరీ కేంద్రం 'ఫోర్ట్ నాక్స'గా ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి చెందిందని అందరికీ సుపరిచితమే. ఈ సంస్థలోనే దేశంలోని స్వర్ణాభరణాలు, బంగారు బిస్కట్లు, కాయిన్ల నిల్వలు అత్యధికంగా ఉంటాయి. మూడు చోట్ల నిల్వ ఉన్న బంగారమంతా 8,965.65 టన్నులు కాగా, దాని విలువ మన కరెన్సీలో చెప్పాలంటే రూ.16, 49,698 కోట్లు (358.63 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఉంటుంది.
జర్మనీ
నిల్వల విలువ : రూ.6,90, 782 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 3754.29 టన్నులు
జర్మనీ సెంట్రల్ బ్యాంక 'డౌట్‌చే బుండేస్ బ్యాంక'లో దేశంలోని నిల్వలన్నీ ఉంటాయి. వాటి విలువ అమెరికన్ డాలర్లలో 150.17 బిలియన్ డాలర్లు ఉంటుంది. మన దేశ కరెన్సీ లెక్కల ప్రకారం జర్మనీలో నిల్వ ఉన్న బంగారం విలువ రూ.6, 90, 782 కోట్ల మేరకు ఉంటుంది.
ఇటలీనిల్వల విలువ : రూ. 4,97, 122 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 2,701.9 టన్నులు.
'బంచా డిల్టాలియా' అనే సంస్థలోనే ఇటలీకి చెందిన బంగారం నిల్వలన్నీ ఉంటాయి. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఇటలీ 2709.9 టన్నుల పసిడి నిల్వలు కలిగి ఉన్నదని తెలుస్తోంది. ఇది ప్రపంచంలోని బంగారం నిల్వల్లో నాల్గవ వంతు ఉంటుంది. దీని విలువ భారత కరెన్సీలో రూ.4,97, 122 కోట్లు.
ఫ్రాన్స్
నిల్వల విలువ : రూ. 4,93, 810 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 2,683.81 టన్నులు
బాంక్యూ డి ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ జాతీయ బ్యాంక దేశంలోని స్వర్ణ నిల్వలకు నిలయం. దీని విలువ ఫ్రాన్స్ విదేశీ ద్రవ్య నిల్వలతో పోలిస్తే 65.7 శాతం ఉంటుంది. 2683.91 టన్నుల బంగారం నిల్వల విలువ సుమారు 107.35 బిలియన్ డాలర్లు (రూ.4,93, 810 కోట్లు) ఉంటుందని అంచనా.
చైనా
నిల్వల విలువ : రూ. 2,13,716 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 1,161.6 టన్నులు.
ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా చైనా స్వర్ణ నిల్వల్లోనే ఆరో స్థానంలో నిలిచింది. భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని ఊహించగలమా కావచ్చు, కానీ చైనా పసిడి నిల్వల విలువ ఆ దేశ విదేశీ ద్రవ్య విలువలో కేవలం 1.6 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ చైనాలో ప్రతి ఒక్కరూ 34.70 డాలర్ల విలువ చేసే స్వర్ణాభరణాలు కలిగి ఉంటారు.
స్విట్జర్లాండ్
నిల్వల విలువ : రూ. 2,10, 864 కోట్ల
నిల్వ ఉన్న బంగారం : 1,146 టన్నులు.
స్విట్జర్లాండ్ ద్రవ్య విధానాన్ని నియంత్రించే స్విస్ నేషనల్ బ్యాంక గణాంకాల ప్రకారం దేశంలో 1,144.1 టన్నుల బంగారం ఉంది ఇది ప్రపంచంలోని నిల్వల్లో ఏడో స్థానంలో ఉంటుంది. దీని విలువ సుమారు 45.84 బిలియన్ల అమెరికన్ డాలర్లు కాగా, భారత కరెన్సీలో రూ. 2,10, 864 కోట్లు ఉంటుంది. ఇటలీ విదేశీ నిధులతో పోలిస్తే ఇది 27.1 శాతం ఉంటుంది.
జపాన్
నిల్వల విలువ : రూ. 1,55, 158 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 843.25 టన్నులు.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం నిల్వల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న జపాన్, విదేశీ ద్రవ్య నిల్వల్లో స్వర్ణ నిల్వల విలువ కేవలం 2.5 శాతం మాత్రమే. దేశీయంగా బంగారం నిల్వల లావాదేవీలను బ్యాంక ఆఫ్ జపాన్ పర్యవేక్షిస్తుంది. జపాన్ బంగారం నిల్వల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.155, 158 కోట్లు ఉంటుంది.
రష్యా
నిల్వల విలువ : రూ. 1,29, 996 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 706.38 టన్నులు.
రష్యా ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంకదిే దేశంలోని బంగారం నిల్వల నిర్వహణ బాధ్యత. 2009 నాటికి రష్యా విదేశీ ద్రవ్య నిల్వల్లో బంగారం నిల్వల విలువ కేవలం 5.1 శాతం మాత్రమే. తర్వాత అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం కొత్తగా గనుల తవ్వకం చేపట్టి ఏటా 21 శాతం బంగారం అదనంగా ఉత్పత్తి చేస్తోంది. అమెరికన్ డాలర్ల ప్రకారం ప్రస్తుతం రష్యాలో బంగారం నిల్వల విలువ అక్షరాల 28.26 బిలియన్ డాలర్లు కాగా, 708.38 టన్నులు నిల్వలున్నాయి.
నెదర్లాండ్స్
నిల్వల విలువ : రూ. 1,23, 740 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 674.98 టన్నులు.
నెదర్లాండ్ బ్యాంక, బంగారం నిల్వలతోపాటు దేశీయ ఆర్థిక వ్యవహారాలను నియంత్రిస్తుంటుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అందుబాటులో ఉన్న నిల్వలు సుమారు 26.9 అమెరికన్ బిలియన్లు కాగా, ప్రస్తుత గ్లోబల్ మార్కెట్‌లో నెదర్లాండ్స్ విదేశీ ద్రవ్య నిల్వల విలువ 53.4 శాతం ఉంటుంది.
తైవాన్నిల్వల విలువ : రూ. 85, 882 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 466.81 టన్నులు.
ఆర్థికాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమను ముందుకు తీసుకెళుతున్న తైవాన్, పసిడి నిల్వల్లో 13వ స్థానంలో నిలవడం విశేషమే మరి. ది సెంట్రల్ బ్యాంక ఆఫ్ ది రిపబ్లిక చైనా (తైవాన్) దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. తైవాన్‌లో ప్రస్తుతం 466. 81 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. తైవాన్ విదేశీ ద్రవ్య నిల్వల్లో ఇది 4.1 శాతంగా ఉంది.
పోర్చుగల్
నిల్వల విలువ : రూ. 77, 556 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 421.51 టన్నులు.
పోర్చుగల్ మాత్రమే తన విదేశీ ద్రవ్య నిధుల్లో 84.9 శాతం బంగారం నిల్వలున్న దేశం. బ్యాంకో డి పోర్చుగల్, దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. రమారమీ పోర్చుగల్‌లో నిల్వ ఉన్న 421.51 టన్నుల బంగారం విలువ అక్షరాలా 16.86 బిలియన్లు (77, 556 కోట్లు) ఉంటుంది.
వెనిజులా
నిల్వల విలువ : రూ. 73, 163 కోట్లు, నిల్వ ఉన్న బంగారం : 397.6 టన్నులు.బ్యాంకో సెంట్రల్ వెనిజులా దేశంలోని బంగారం నిల్వలను పర్యవేక్షిస్తుంది. వెనిజులాలో 397.6 టన్నుల బంగారం నిల్వలున్నాయి. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 73, 163 కోట్లు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పసిడి నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో 15వ స్థానంలో నిలిచిన వెనిజులా విదేశీ ద్రవ్య నిల్వల్లో అవి 36.8 శాతం.
అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ సంస్థ (ఐఎంఎఫ్)
నిల్వల విలువ : రూ. 6.09, 040 కోట్లు
నిల్వ ఉన్న బంగారం : 3311.84 టన్నులు.
అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ సంస్థ (ఐఎంఎఫ్) వివిధ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో భారత్ సహా 185 సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంస్థ స్వర్ణం (బంగారం)పై అనుసరిస్తున్న విధానంలో ప్రతి 25 ఏళ్లకోసారి మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ఐఎంఎఫ్ వద్ద నున్న బంగారం నిల్వల విలువ 3311.84 టన్నులకు అమెరికా డాలర్లలో చెప్పాల్సి వస్తే 132.4 బిలియన్లు కాగా, భారత్ కరెన్సీ ప్రకారం రూ.6,09,040 కోట్లు ఉంటుంది.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇసిబి)
నిల్వల విలువ : రూ. 1,01, 660 కోట్లు,
నిల్వ ఉన్న బంగారం : 522.54 టన్నులు.
1998కల్లా ఏర్పాటైన యూరోపియన్ యూనియన్, సభ్య దేశాల్లో ద్రవ్య విధానంపై బాధ్యత వహిస్తుంది. జర్మనీ దేశంలోని ఫ్రాంకఫేర్డ్‌లో ఉన్న యూరోజోన్ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుత మార్కెట్ గణాంకాల ప్రకారం దాని విలువ రూ.1,01,660 కోట్లు ఉంటుంది.
- ఎంవిఎస్ ప్రణవ్
andhra prabha daily -Fri, 4 Feb 2011.
andhra prabha daily -Fri, 4 Feb 2011.
No comments:
Post a Comment